కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు అందుకే కేంద్రం జోక్యం: షర్మిల

కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ఉమ్మడి ప్రాజెక్టులన్నిటినీ కేంద్రప్రభుత్వం కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు స్వాధీనపరుస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్రం నిర్ణయంపై టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరుగబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో దీనిపై కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సిద్దం అవుతున్నారు. మరికొద్ది సేపటిలో సిఎం కేసీఆర్‌ కూడా దీనిపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. 

ఈ సమస్యపై వైఎస్సార్‌ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఘాటుగా కాస్త భిన్నంగా స్పందించారు. లోటస్‌పాండ్‌  నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కృష్ణ, గోదావరి జలాల పంపకాలపై ఇరురాష్ట్రాలకు చిత్తశుద్ధి లేదు. ఈ సమస్యపై చర్చించడానికి కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యం సమావేశానికి రమ్మనమని ఆహ్వానిస్తే సిఎం కేసీఆర్‌ ఎందుకు వెళ్ళలేదు? సమావేశాన్ని ఎందుకు వాయిదావేయమని కోరారు?ఆయన సమావేశాలకు వెళ్లకుండా ఈ సమస్య గురించి కేంద్రాన్ని, పొరుగు రాష్ట్రాన్ని నిందిస్తుంటారు. అందుకే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని ఇటువంటి నిర్ణయం తీసుకొంది. ఆయన శ్రద్ద చూపకపోవడం వలననే ఈవిదంగా జరిగింది. కనుక దీనికి సిఎం కేసీఆరే బాధ్యత వహించాలి,” అని అన్నారు.