రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఈ నెల 26 నుంచి తెల్ల రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభం కానుంది. సిఎం కేసీఆర్ ఇటీవల జిల్లాల పర్యటనలు చేసినప్పుడు అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొంటూ రాష్ట్రంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్న 3,60,000 మందికిపైగా లబ్దిదారులకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ఆదేశించారు. జూలై 26 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టి 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొని లబ్దిదారులకు స్వయంగా రేషన్ కార్డులు అందజేయాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు పొందినవారికి వచ్చే నెల నుంచే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.