
ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, తరువాత ఎంపీ రాహుల్ గాంధీని కలవడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఫిర్యాదుల విభాగానికి ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న డాల్‌మియా “కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్‌కి స్వాగతం’ అంటూ చేసిన ట్వీట్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతునట్లు సూచిస్తోంది. మీడియాలో వస్తున ఈ ఊహాగానాలను ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఖండించలేదు. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు భావించవచ్చు.
ఇదివరకు ఆయన యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అలాగే తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకె పార్టీ కోసం కూడా పనిచేశారు. కనుక కాంగ్రెస్ పార్టీతో ఆయనకు మంచి అనుబందమే ఉందని భావించవచ్చు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్ ఇకపై ఏ పార్టీల కోసం ఎన్నికల వ్యూహ నిపుణుడిగా పనిచేయబోనని చెప్పారు. బహుశః కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశ్యం ఉంది కనుకనే ఆవిదంగా చెప్పి ఉండవచ్చు.