ఎస్‌బీఐ సెక్యూరిటీ గార్డు సహోద్యోగిపై కాల్పులు

హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీ వద్ద గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సర్ధార్ ఖాన్ అనే వ్యక్తి అదే బ్యాంకులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సురేందర్ అనే వ్యక్తిపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సురేందర్ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది నరేందర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని సర్ధార్ ఖాన్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం వారిరువురికీ వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశానికిలోనైన సర్దార్ ఖాన్ తన వద్ద ఉన్న తుపాకీతో నరేందర్‌పై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం నరేందర్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు శస్త్రచికిత్స చేసి పొట్టలోకి దూసుకుపోయిన బుల్లెట్లు బయటకు తీసి అవసరమైన చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

సర్ధార్ ఖాన్ గత 20 ఏళ్లుగా అబిడ్స్‌లోని ఎస్‌బీఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని బ్యాంక్ అధికారులు తెలిపారు. సర్ధార్ ఖాన్, నరేందర్ ఇద్దరు మంచి దోస్తులని క్షణికావేశంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని తెలిపారు.