
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు, అధికారం అనుభవించి కష్టకాలం పార్టీకి హ్యాండిచ్చే నేతలను చాలా మందినే చూశాము. తాజాగా ఆ జాబితాలో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి కూడా చేరారు. టిఆర్ఎస్ నుంచి టికెట్ ఖరారు చేసుకొని వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్న ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ్ళ బహిష్కరణ వేటు వేసింది. అయితే తానే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. రాజకీయ నాయకులు పార్టీని వీడుతూ పార్టీపై విమర్శలు చేయడం కూడా పరిపాటే. కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీపై, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
“రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు చెల్లించి పిసిసి అధ్యక్ష పదవి కొనుకొన్నారు. నేను కాదు...ఆయనే ఈటల రాజేందర్‌కు అమ్ముడుపోయారు. అందుకే ముందే హుజూరాబాద్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవదని తేల్చి చెప్పేశారు. నిజానికి హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు దక్కించుకొన్నా గొప్ప విషయమే అవుతుంది. రాష్ట్రాభివృద్ధిలో నేను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశ్యంతోనే పార్టీని వీడుతున్నాను,” అని అన్నారు.
అభివృద్ధిలో భాగస్వామి కావడం అంటే టిఆర్ఎస్ పార్టీలో చేరడం అని వేరే చెప్పక్కరలేదు. టిఆర్ఎస్ టికెట్ కూడా ఖరారైందని ఇప్పటికే మీడియాకు లీక్ చేశారు కనుక హుజూరాబాద్ బరిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డి, బిజెపి నుంచి ఈటల రాజేందర్ ఖరారు అయ్యారు. రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉపఎన్నికలలో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరిని నిలుపుతారో చూడాలి.