
తెలంగాణ పిసిసి కార్యదర్శి, హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్-ఛార్జ్ కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈరోజు షో-కాజ్ నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చిందని, కనుక పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తుండగా, ఇటీవల ఆయన మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతూ ‘టిఆర్ఎస్ టికెట్ తనకే ఖరారు అయ్యిందని, స్థానిక యువతకు పంచేందుకు డబ్బు కూడా సిద్దంగా ఉంచానని’ అన్నారు. ఆ ఫోన్ సంభాషణ మీడియాకు లీక్ అవడంతో జిల్లా కాంగ్రెస్ అప్రమత్తమైంది.
కొన్ని రోజుల క్రితం ఓ పెళ్ళికి హాజరైన మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ కొంతసేపు కౌశిక్ రెడ్డితో ఒంటరిగా మాట్లాడారు. అప్పటి నుంచే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ను సంప్రదించకుండా ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు చేస్తుండటం ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ఇప్పుడు తనకు టిఆర్ఎస్ టికెట్ ఖాయం అయ్యిందని చెప్పడంతో ఆ ఊహాగానాలు నిజమేనని స్పష్టం అయ్యింది. ఇవాళ్ళ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నేతృత్వంలో అత్యవసరంగా సమావేశం కానున్నారు. దానికి కౌశిక్ రెడ్డిని కూడా పిలిచి సంజాయిషీ కోరుతారా లేక ఆయనపై వేటు వేయాలని సిఫార్సు చేస్తారా? అనేది ఇంకా తెలియవలసి ఉంది.