నేడు గులాబీ కండువా కప్పుకోనున్న ఎల్.రమణ

తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ నేడు టిఆర్ఎస్‌లో చేరనున్నారు. ఇవాళ్ళ తెలంగాణ భవన్‌లో మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకోనున్నారు. ఈటల రాజేందర్‌ను బయటకు పంపించడంతో కరీంనగర్‌ జిల్లాలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేర్చుకొంటున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్, జిల్లాకు చెందిన టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక టిఆర్ఎస్‌ నేతలు పాల్గొంటారు.

ఇంతకాలంగా రాష్ట్రంలో కనిపించని టిడిపికి ఆయన అధ్యక్షుడిగా కొనసాగినప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత బలమైన అధికార పార్టీలో చేరే అవకాశం వచ్చింది కనుక ఆయనకు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే భావించవచ్చు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణను టిఆర్ఎస్‌లోకి తీసుకొంటున్నందున సిఎం కేసీఆర్‌ ఆయనకు పార్టీలో, వీలైతే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించవచ్చు. అయితే ఆయనను హుజూరాబాద్‌ ఉపఎన్నికల బరిలో దించుతారా లేదా అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.