మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ఈరోజు నారాయణపేట జిల్లాలో పర్యటించి
తిరిగివెళుతున్నప్పుడు వారి కాన్వాయ్‌ని ఏబీవీపీ విద్యార్దులు అడ్డుకొన్నారు. తెలంగాణ
ఏర్పడి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్ళు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు
విద్యార్దుల సమస్యలేవీ పరిష్కరించలేదని నిరసన తెలియజేస్తూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు చేస్తూ మంత్రుల కాన్వాయ్‌ని అడ్డుకొన్నారు. అయితే అక్కడే
ఉన్న పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి పక్కకు తొలగించడంతో కాన్వాయ్ ముందుకు సాగిపోయింది.
మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనలకు వస్తునప్పుడు బిజెపి, ఏబీవీపీ కార్యకర్తలు తరచూ ఈవిదంగా ఆయనను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తుండటంతో పోలీసులు ముందుగానే వారిని అదుపులో తీసుకొని మంత్రి పర్యటన ముగిసిన తరువాత విడిచిపెడుతున్నారు. ఇప్పుడూ అలాగే చేసినప్పటికీ కొందరు ఏబీవీపీకి చెందిన కొందరు విద్యార్దులు హటాత్తుగా రోడ్డుపైకి వచ్చి మంత్రుల కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు.
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నప్పుడు ఏదో వంకతో వారిని అడ్డుకోవడం వలన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగితే నష్టపోయేది ప్రజలే. కనుక ప్రతిపక్షాలు శాంతియుతంగా నిరసనలు తెలియజేయడం మంచి పద్దతి. ఇటువంటి సందర్భాలలో మంత్రులు కూడా సంయమనంతో వ్యవహరిస్తూ వీలైతే కారు దిగి నిరసనకారులతో మాట్లాడితే వారి పట్ల ప్రజలలో కూడా గౌరవం పెరుగుతుంది.