అది టిఆర్ఎస్‌ ప్రభుత్వం కాదు టిడిపి ప్రభుత్వమే: రేవంత్‌

మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించే రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తనపై మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలకు అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను టిడిపికి, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి, నా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి అప్పగించిన తరువాతే కాంగ్రెస్ పార్టీలో చేరాను. పార్టీలో చేరిన తరువాత కష్టపడి పనిచేస్తూ ఈ స్థాయికి ఎదిగాను తప్ప అడ్డదారిలో వెళ్లలేదు. మీలాగ వారసత్వంగా పదవులు, అధికారం దక్కించుకోలేదు. కాంగ్రెస్‌లో నేను టిడిపివాడిని అయితే మీ పార్టీలో సిఎం కేసీఆర్‌తో సహా తలసాని, ఎర్రబెల్లి, కొప్పుల, గంగుల, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాధోడ్ అందరూ ఎవరు? టిడిపి నుంచి వచ్చినవారే కదా?ఆ లెక్కన టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అందరూ టిడిపి వాళ్ళే కదా?తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని సిఎం కేసీఆర్‌ సోనియా గాంధీకి హామీ ఇచ్చి మోసం చేసిన మాట వాస్తవం కాదా?” అని అన్నారు. 

వచ్చే ఏడాది ఆగస్ట్ నెలలో తెలంగాణ ప్రభుత్వం రద్దవుతుందని రాష్ట్రంలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు వస్తాయని రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు.