
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హటాత్తుగా ప్రవేశించిన వైఎస్ షర్మిల నిన్న తన పార్టీ వైఎస్సార్ టిపి జెండాను ఆవిష్కరించి, పార్టీ సిద్దాంతాలు, ఆశయాల గురించి వివరించిన తరువాత, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి తమ ఉమ్మడి రాజకీయశత్రువులను ఒడిస్తుంటారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొంటారు. ఇంటికి పిలుచుకొని భోజనాలు పెట్టుకొంటారు. కానీ ఇద్దరూ కృష్ణా జలవివాదాలపై కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోలేరా? ఏపీ ప్రభుత్వం రెండేళ్ళుగా కృష్ణానదిపై ప్రాజెక్టులు కడుతుంటే సిఎం కేసీఆర్‌కు ఇప్పుడు మేల్కొన్నారా?ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించకుండా ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన నీటిని ఎట్టి పరిస్థితులలో వదులుకోబోము. అలాగే ఏపీకి కేటాయించిన నీటిని అడ్డుకోబోము. ఈ విషయంలో ఇదే మా పార్టీ సిద్దాంతం. రెండు రాష్ట్రాలకు సమ న్యాయం జరగాలనేదే మా అభిమతం.
తెలంగాణ సాధించి ప్రజలకు ఏం ప్రయోజనం కలిగింది? రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు గడిచినా ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడితే సిఎం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడింది. ఆయన లక్షల కోట్లు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. అప్పులు చేసి తెచ్చిన ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది?సంపద సృష్టించడమంటే అందినకాడికి అప్పులు చేయడం కాదు. అందరూ ఎవరి కాళ్లపై వారు నిలబడేలా చేసి అభివృద్ధి సాధించాలి. సిఎం కేసీఆర్, మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పదేపదే చెపుతుంటారు. కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉండికదా మరి అవినీతికి పాల్పడినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు.