
తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈరోజు జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు(కెఆర్ఎంబి) త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలపై ఈరోజు త్రిసభ్య కమిటీ చర్చించాల్సి ఉంది. కానీ ఈనెల 20వ తేదీ తర్వాత రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో నేడు జరగాల్సిన కెఆర్ఎంబి త్రిసభ్య సమావేశం వాయిదా పడింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ కెఆర్ఎంబికి లేఖ రాసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంపై కెఆర్ఎంబికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, పులిచింతల, సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో విలువైన నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు యాజమాన్యానికి లేఖ రాసింది. త్వరలోనే మళ్ళీ త్రిసభ్య సమావేశం నిర్వహించి 20వ తేదీ తరువాత ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో జరుగబోయే సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తామని కెఆర్ఎంబి తెలిపింది.