టిఆర్ఎస్‌లో చేరుతున్నాను: ఎల్.రమణ

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ టిఆర్ఎస్‌లో చేరబోతునట్లు ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన నిన్న ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి సిఎం కేసీఆర్‌ నాకు వివరించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన నావంటివారు టిఆర్ఎస్‌లో ఉంటే బాగుంటుందని అన్నారు. నేను కూడా రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావిస్తున్నందున సిఎం కేసీఆర్‌ ఆహ్వానాన్ని మన్నించి టిఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొన్నాను. నా అనుచరులతో మాట్లాడి రెండు మూడు రోజులలో తుది నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ, “చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఎల్.రమణ ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అందుకే ఆయన పట్ల సిఎం కేసీఆర్‌కు చాలా గౌరవం ఉంది. సిఎం కేసీఆర్‌ ఆహ్వానించగనే ప్రగతి భవన్‌కు వచ్చి ఆయనను కలిసినందుకు ఎల్.రమణకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. రెండు మూడు రోజులలో ఎల్.రమణ టిఆర్ఎస్‌లో చేరుతారు. ఆ తరువాత టిడిపిని టిఆర్ఎస్‌ పార్టీలో విలీనం చేస్తాం. రాష్ట్రంలో ఇక టిడిపికి భవిష్యత్‌ లేదు కనుక కొన్ని జిల్లాలలో ఉన్న మిగిలిన టిడిపి నేతలు, వారి అనుచరులు కూడా త్వరలోనే టిఆర్ఎస్‌లో చేరుతారని భావిస్తున్నాము,” అని అన్నారు.