5.jpg)
మంత్రి కేటీఆర్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌లను ఉద్దేశ్యించి నిన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి, “మార్కెట్లోకి కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు. పిసిసి అధ్యక్ష పదవి అంటే అదేదో ప్రధానమంత్రి పదవని రేవంత్ రెడ్డి అనుకొంటున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆయన ఇప్పుడు నీతులు చెపుతున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీయే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే ఇక్కడ ఆయన ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్దంగా టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయ్యారు. ఆనాడు ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తెలంగాణ ప్రజల ప్రాణాలు బలిగొంటున్న బలిదేవత అని అన్నారు. ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వగానే ఆమె తెలంగాణ తల్లి అని అంటున్నారు,” అని అన్నారు.
నేటి నుండి బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టబోతుండటంపై స్పందిస్తూ, “రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ మొదలైంది. ఇంతకాలం కరోనా కారణంగా ఇళ్ళలో కూర్చోన్న ప్రతిపక్ష నాయకులు బయటకు వచ్చి పాదయాత్రలకు సిద్దం అవుతున్నారు. అది వారి ఆరోగ్యానికి మంచిదే. పాదయాత్రలు చేసేటప్పుడు రాష్ట్రంలో పచ్చగా కళకళలాడుతున్న ప్రతీ పల్లెను సందర్శించి, ఈ ఏడేళ్ళ టిఆర్ఎస్ పాలనలో ఎంతగా అభివృద్ధి చెండాయో మీరే స్వయంగా కళ్ళారా చూసి మీ నోటితోనే ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. అయితే ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా సిఎం కేసీఆర్ అనే ఓ మహాశక్తిని ఎవరూ ఎదుర్కొలేరు. ఆయన మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులవంటివారు కారు. రెండు దశాబ్ధాల పాటు పోరాడి తెలంగాణ సాధించుకొన్న వ్యక్తి. కేంద్రప్రభుత్వంతో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి వంటివారికి ఎదురొడ్డి పోరాడి గెలిచిన మహాయోధుడు. సిఎం కేసీఆర్‌ను తిడితే ఎవరూ గొప్పవారు అయిపోలేరు. ఆయన గట్టిగా నాలుగు రోజులు రాష్ట్రంలో పర్యటిస్తే అందరి నోళ్ళు మూతపడేలా చేయగలరు,” అని మంత్రి కేటీఆర్ అన్నారు.