ప్రగతి భవన్‌కు ఎల్.రమణ?

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఇవాళ్ళ ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి క్రమంగా బలహీనపడుతున్న టిడిపి ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యింది. రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలలోను పోటీ చేయలేని దుస్థితిలో ఉంది. కనుక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మారే ఆలోచనలు చేస్తుండగా ఈటల రాజేందర్‌ వ్యవహారం తరువాత టిఆర్ఎస్‌ నుంచి ఆహ్వానం అందింది. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకొన్నారు. ఇవాళ్ళ ఆయన ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలవబోతున్నట్లు తాజా సమాచారం.

ఒకవేళ వెళ్ళినట్లయితే ఆయన టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఈరోజే ప్రకటించే అవకాశం ఉంది. ఈటల రాజేందర్‌ను బయటకు పంపించడంతో హుజూరాబాద్‌లో బలమైన బీసీ నాయకుడు కోసం టిఆర్ఎస్‌ చూస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణతో ఆ లోటును భర్తీ చేసుకొని వీలైతే ఆయనను అక్కడి నుంచి పోటీ చేయించాలని సిఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌ నుంచి రామనను పోటీ చేయించకపోయినా ఆయనను టిఆర్ఎస్‌లో తీసుకోవాలని భావిస్తున్నారు.