
కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 146 ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్దమవుతోంది. వాటిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. అయితే ఆంధ్ర ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకొన్న స్టీల్ ప్లాంటును దానితో ప్రజలకున్న సెంటిమెంటును పట్టించుకోకుండా దానిని అమ్మకానికి పెట్టేస్తుండటంపై గత మూడు నాలుగు నెలల నుండి స్టీల్ ప్లాంట్ కార్మికులు, అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవలసిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ వ్రాసింది. కానీ కేంద్రప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా టెండర్ల ప్రక్రియకు సిద్దం అవుతున్నట్లు వార్తలు రావడంతో నేడు వందలాదిమంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ప్రతిపక్షాలు నేడు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. స్టీల్ ప్లాంటును అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని లేకుంటే ఆందోళనలు ఉద్యమస్థాయికి తీసుకువెళ్ళి అడ్డుకొంటామని హెచ్చరించారు.
అయితే కేంద్రప్రభుత్వం ఇటువంటి హెచ్చరికలకు భయపడబోదని ఏనాడో స్పష్టం అయ్యింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది రైతులు ఢిల్లీ సరిహద్దులో గత ఆరేడు నెలలుగా ధర్నా చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. కనుక స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పోరాటాలకు కేంద్రం తలొగ్గుతుందనుకోలేము. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణతో దానిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు, వారి కుటుంబాల జీవితాలు, భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారుతుంది.