.jpg)
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్న పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీతో పెద్దమ్మ గుడికి బయలుదేరివెళ్ళారు. ఆ ర్యాలీతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న యాకన్న ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈవిదంగా ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతటి పెద్ద పదవిలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు, తన కోసం ఎక్కడా ట్రాఫిక్‌ను నిలపవద్దని, ప్రజలతో పాటు సిగ్నల్ పడిన తరువాతే వెళ్దామని సూచించారు. మాజీ పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పదవిలో ఉన్నప్పుడు కావాలనుకొంటే ప్రత్యేక విమానాలలో తిరగగలిగేవారు. కానీ ఆయన కూడా సాధారణ ప్రయాణికుడిలాగే టికెట్ కొనుక్కొని అందరితో కలిసి ప్రయాణించేవారు. రాజకీయాలలో ఉన్నవారు ఈవిదంగా హూందాగా వ్యవహరిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ మన రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు తమ కోసం రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేయడమే చాలా గొప్పగా భావిస్తుంటారు. ప్రజాధారణ పొందాలనుకొనేవారు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఎందుకు తెలుసుకోరో?