కరేబియన్ దేశమైన హైతీలో దారుణం జరిగింది. స్థానిక కాలమాన ప్రకారం బుదవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ దేశాధ్యక్షుడు జోవెనెల్ మోయిసీని ఆయన ఇంట్లోనే తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఆ కాల్పులలో ఆయన భార్య మార్టీన్ మోయిసీ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా హైతీలో రాజకీయ ఆస్తిరత, అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. కానీ వాటిని అదుపు చేయడంలో జోవెనెల్ మోయిసీ విఫలమవడంతో చివరకు అల్లరిమూకల చేతిలో ఆయన ప్రాణాలు పోగొట్టుకొన్నారు. తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్న క్లౌడే జోసెఫ్ ప్రెసిడెంట్ జోవెనెల్ మోయిసీ హత్యపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా అమానవీయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే ఆరాచక పరిస్థితులు నెలకొన్న హైతీలో దేశాధ్యక్షుడు జోవెనెల్ మోయిసీ హత్యతో అట్టుడికిపోతోంది. దేశంలో భారీగా విధ్వంసం జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండటం ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.