కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రిగా పదోన్నతి

తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించింది. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో కొద్ది సేపటి క్రితం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి కిషన్‌రెడ్డికి సహకారశాఖను అప్పగించనున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని కిషన్‌రెడ్డి మంచి సమర్ధంగా నిర్వహించడంతో ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు పదోన్నతి కల్పించారు. దీంతో కేంద్రప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఓ కేంద్రమంత్రి ఉన్నట్లు అయ్యింది. 

ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఒకేసారి 43 మందిని తీసుకోవడం, ఒకేసారి 12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలకడం రెండూ విశేషమే అని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ సూచన మేరకు మొత్తం 12 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు ఇచ్చారు. రాజీనామాలు చేసినవారిలో డాక్టర్ హర్షవర్ధన్, ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, రమేశ్ పోఖ్రియాల్, బాబుల్ సుప్రియో, సంతోష్ కుమార్ గంగ్వార్, ప్రతాప్ చంద్ర సారంగి తదితరులున్నారు.