ఆ నలుగురి చేతిలో తెలంగాణ బందీ: రేవంత్‌ రెడ్డి

మల్కాజగిరీ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తల సమక్షంలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ అధికారం చేపట్టాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. ఉద్యోగాలు భర్తీ కాలేదు. బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగలేదు. వారిపై దాడులు ఆగడంలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం... సమాజం కల్వకుంట్ల కుటుంబానికి చెందిన ఆ నలుగురి చేతిలో బందీ అయిపోయింది. వారి చెర నుంచి విడిపించడానికే సోనియా గాంధీ నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రానికి పట్టిన ఈ గులాబీ చీడను వదిలించడానికి అందరం కలిసికట్టుగా ప్రయత్నిద్దాము. పార్టీలో ప్రతీ ఒక్కరూ రాబోయే రెండేళ్లపాటు తమతమ కుటుంబాలకు ‘శలవు’ పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే మన అందరి లక్ష్యం కావాలి,” అని అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన అనుచరులు రేవంత్‌ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేయగా ఆయన వారిని వారించారు. ఇకపై ఎన్నడూ ఇటువంటి నినాదాలు చేయవద్దని సున్నితంగా మందలించారు. ఇకపై పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కోసం మాత్రమే నినాదాలు చేయాలని సూచించారు.