హైదరాబాద్‌ మేయర్ పదవి ఇస్తానన్నా మేం ఒప్పుకోలేదు: బండి

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. 

“జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మా పార్టీ చాలా సీట్లు గెలుచుకోబోతోందని ముందే గ్రహించిన సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి టిఆర్ఎస్‌తో చేతులు కలిపితే బిజెపికి మేయర్ పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన అంగీకరించలేదు. సిఎం కేసీఆర్‌ ఆ విషయం దాచిపెట్టి  రాష్ట్రాభివృద్ధి పనుల గురించి కేంద్రమంత్రులతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్ళివచ్చినట్లు ప్రచారం చేసుకొన్నారు. తరువాత ఈటల రాజేందర్‌ను పిలిపించుకొని మనకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పదవి వస్తుందని కనుక పార్టీ వీడవద్దని చెప్పారు. అంటే ఈటల పార్టీ వీడుతారని అప్పటికే సిఎం కేసీఆర్‌కు తెలుసన్నమాట! 

ఈనెల 9 నుంచి ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో నేను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నాను. దానిలో ప్రధానంగా సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి చిట్టాలను బయటపెట్టబోతున్నాను. సరైన సమయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని సిఎం కేసీఆర్‌పై తగిన చర్యలు తీసుకొంటుంది. 

సిఎం కేసీఆర్‌ అవినీతిలో కూరుకుపోయినప్పటికీ ఆయన రాజకీయంగా చాలా బలవంతుడు. కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పార్టీయే మాకు ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు. అది బిజెపికి పోటీ ఇవ్వలేదు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌, బిజెపిల మద్యనే ఉంటుంది. సిఎం కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేసుకొన్నందునే హుజూరాబాద్‌లో బిజెపికి బదులు ఆయన పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆయన ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు కనుక దాని వలన మాకు లాభమే తప్ప నష్టం లేదు. ఈసారి ఆ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి మా సత్తా చాటుకొంటాము,” అని బండి సంజయ్‌ అన్నారు.