4.jpg)
రేవంత్ రెడ్డి నేడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు కొత్తగా నియమితులైన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ ఛైర్మన్, ఎన్నికల కమిటీ ఛైర్మన్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ తదితరులు కూడా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు పిసిసి అధ్యక్షుడుగా వ్యవహరించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలు తదితరులు పాల్గొంటారు.
రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరి ముందుగా పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో మసాబ్ ట్యాంక్ మీదుగా నాంపల్లి చేరుకొని అక్కడి యూసుఫైన్ దర్గాను సందర్శించి ప్రార్ధనలలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా గాంధీభవన్‌లో చేరుకొని పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త శకం ప్రారంభం అయినట్లేనని పార్టీలో చాలా మంది విశ్వసిస్తున్నారు. ఓ పక్క అత్యంత బలమైన అధికార టిఆర్ఎస్ పార్టీని, మరోపక్క రాష్ట్రంలో బలపడిన బిజెపిని ఎదుర్కొంటూ క్లిష్ట పరిస్థితులలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన ఏవిదంగా గట్టెక్కిస్తారో చూడాలి.