
సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండే బిజెపి మహిళా నేత విజయశాంతి, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీరును తప్పు పడుతూ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. ఇటీవల ఆర్‌ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఓ సభలో మాట్లాడుతూ దేశ ప్రజలు కాలక్రమంలో వివిద మతాలవారుగా విడిపోయారని, కానీ వారు ఏ మతానికి, ప్రాంతానికి చెందినప్పటికీ అందరూ భారతీయులేనని అన్నారు. హిందూ, ముస్లింల డీఎన్‌ఏ ఒకటేనని కనుక ఒక వర్గంపై మరో వర్గం దాడులను ఖండిస్తున్నానని అన్నారు. భారత్‌లో ఇస్లాం మతం పట్ల వ్యతిరేకత లేదని కనుక ముస్లింలు ఎవరూ భయాందోళనలు లేకుండా జీవించవచ్చని మోహన్ భవత్ అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందిస్తూ ట్విట్టర్‌లో కొన్ని మెసేజులు పోస్టు చేశారు. “అయితే భారత్‌లోని మైనార్టీ ముస్లింలపై దాడులు జరుగుతున్నట్లు ఆయన (మోహన్ భగవత్) అంగీకరిస్తున్నట్లేనా? ఆర్‌ఎస్ఎస్ హిందువులను రెచ్చగొట్టి ముస్లింలపై దాడులు చేయిస్తున్నట్లు ఆయన అంగీకరిస్తారా?ఆయన బిజెపి పెద్దలకు కూడా ఈ మాటలు చెప్పగలరా?” అంటూ ప్రశ్నించారు.
ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పు పడుతూ విజయశాంతి కూడా ట్వీట్స్ చేశారు. “హిందూ, ముస్లింలతో సహా అన్ని మతాలవారు భారతీయులేనని...ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సరికాదని మోహన్ భగవత్ చెప్పిన మాటలలో అసదుద్దీన్ ఓవైసీకి ఏమి తప్పు కనిపించిందో తెలీదు. అవకాశవాదుల దృష్టిలో రామ అనే పదం కూడా బూతు అన్నట్లుగా ఆయన దృష్టిలో మోహన్ భగవత్ చాలా మంచి ఉద్దేశ్యంతో చెప్పిన మాటలలో కూడా తప్పు కనిపించింది. హిందూ, ముస్లింలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూసే ఓవైసీకి మోహన్ భగవత్ మంచి ఉద్దేశ్యంతో చెప్పిన మాటలు కూడా క్రిమినల్ చర్యగానే కనిపిస్తున్నాయి. మోహన్ భగవత్‌ను వేలెత్తి చూపే ముందు ఆనాడు మీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్న మాటలను ఖండించి ఉంటే బాగుండేది,” అని ఆమె ట్వీట్ సారాంశం.