10.jpg)
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం రూ.385 కోట్లు వ్యయంతో నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనేక ఫ్లై ఓవర్లను నిర్మించింది. బాలానగర్ ఫ్లై ఓవర్‌ను మూడేళ్ళలో నిర్మించాము. ఫతేనగర్ వద్ద కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాము. ఇవాళ్ళ బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చేయగానే మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సూచిత్రా క్రాస్ రోడ్, కుత్బుల్లాపూర్ సంగతి ఏమిటని అడుగుతున్నారు. అక్కడ కూడా తప్పకుండా ఫ్లై ఓవర్లను నిర్మిస్తాము. అసలు ఔటర్‌రింగ్ రోడ్డును కలుపుతూ ఓ స్కైవే నిర్మించాలనుకొన్నాము. కానీ మద్యలో రక్షణశాఖ భూములు ఉండటంతో మొదలుపెట్టలేకపోయాము. ఆ భూముల విషయమై కేంద్రప్రభుత్వంతో ఎన్నిసార్లు మాట్లాడినా స్పందించడం లేదు. కేంద్రప్రభుత్వం సహకరిస్తే 3-4,000 కోట్లు ఖర్చైనా స్కైవే నిర్మించడానికి సిద్దంగా ఉన్నాము. మళ్ళీ మరోసారి గట్టిగా ప్రయత్నించి, అప్పటికీ కేంద్రప్రభుత్వం సహకరించకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఫ్లై ఓవర్లే నిర్మిస్తాము,” అని అన్నారు.
బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.