జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశిస్తున్న వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ని ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద స్వర్గీయ వైఎస్సార్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి హైదరాబాద్‌ తిరిగి వస్తారు. సాయంత్రం పంజాగుట్ట, బంజారాహిల్స్ లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసిన తరువాత అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌ చేరుకొని పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారు 5-6,000 మంది నేతలు, కార్యకర్తలు హాజరవుతారయ్యే అవకాశం ఉంది. గురువారం జరుగబోయే ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి వైఎస్ షర్మిల, ముఖ్య నేతలతో కలిసి ఆదివారం లోటస్ పాండ్ వద్ద సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.