జలవిద్యుత్ ఉత్పత్తి కోసమే శ్రీశైలం: తెలంగాణ ప్రభుత్వం

శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేయగా దీనిపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ వ్రాసింది. దానికి తెలంగాణ నీటి పారుదలశాఖ ఇంజనీర్ ఇన్‌ చీఫ్ (ఈఎన్‌సీ) సీహెచ్‌ మురళీధర్ లేఖ ద్వారా బదులిచ్చారు. దానిలో ఆయన శ్రీశైలం ప్రాజెక్టును1959లో ప్రధానంగా జలవిద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించారు తప్ప ఇతర అవసరాల కోసం కాదని కనుక విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే హక్కు, అధికారం తమకు ఉందని స్పష్టం చేశారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటాను మాత్రమే వినియోగించుకొంటూ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కనుక ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీటిని నిలువచేసి ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగించుకొంటోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 తీర్పును ఉల్లంఘిస్తూ నీటిని తరలించుకుపోతోందని దాని వలన నాగార్జునసాగర్ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈఎన్‌సీ సీహెచ్‌ మురళీధర్ ఫిర్యాదు చేశారు.