ఆగస్ట్ నుంచి 57 ఏళ్ళవారికి వృద్ధాప్య పింఛన్:సిఎం కేసీఆర్‌

 సిఎం కేసీఆర్‌ ఆదివారం సిరిసిల్లా జిల్లా పర్యటన సందర్భంగా పలు వరాలు ప్రకటించారు. జిల్లాలో 1,320 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసర్చ్ (ఐడీటీఆర్), సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయిన వేముల కవిత అనే మహిళ సిఎం కేసీఆర్‌ను కలిసి తన కష్టాలను మొరపెట్టుకోగా అప్పటికప్పుడు ఆమెకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పించారు. 

నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా నర్సులు తమ స్టైఫండ్ పెంచాలని సిఎం కేసీఆర్‌ను కోరారు. ఆయన వెంటనే స్పందిస్తూ మూడేళ్ళ శిక్షణా కాలంలో మొదటి సం.లో ఇస్తున్న రూ.1,500 స్టైఫండ్‌ను రూ.5,000కు, రెండో సం.లో ఇస్తున్నరూ.1,700ను రూ.6,000కు, మూడో సం.లో ఇస్తున్న రూ.1,900 స్టైఫండ్‌ను రూ.7,000కు పెంచుతామని ప్రకటించారు. సిరిసిల్లా జిల్లాలో మాత్రమే పెంచి రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో నర్సింగ్ కళాశాలను విడిచిపెట్టడం సాధ్యం కాదు కనుక రాష్ట్రంలో అన్ని నర్సింగ్ కళాశాలలకు ఈ పెంపును వర్తింపజేయవచ్చు.  

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్రమోడీ మొదలు ప్రతిపక్ష నేతల వరకు అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని కానీ ఇప్పుడు ఏడాది పొడవునా జిల్లాలలో పారుతున్న నీటిని చూసి సామాన్యప్రజలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం దాని ప్రయోజనాలు అర్దమవుతున్నాయని సిఎం కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తరువాత వేసవిలో సైతం పంటలు వేసుకోగలుగుతున్నామని, దేశానికి సరిపడినన్ని బియ్యం అందించగలుగుతున్నామని అన్నారు. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ నీటిని ఎంత సమర్ధంగా ఉపయోగించుకోగలమనేది జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతిలో ఉందని సిఎం కేసీఆర్‌ అన్నారు. సిరిసిల్లా జిల్లా జలకూడలిగా మారడం చూసి తాను చాలా ఆనందిస్తున్నానని సిఎం కేసీఆర్‌ అన్నారు.