రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్ట్ 9 నుంచి అక్టోబర్ 2వరకు రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఆగస్ట్ 9వ తేదీన హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెడతారు.
తొలి రోజు పాదయాత్ర హైదరాబాద్‌లో బేగంబజార్ మీదుగా ఆరమైసమ్మ ఆలయం వరకు సాగుతుంది. ఆ తర్వాత చేవెళ్ళ మీదుగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల మీదుగా రోజుకి 15-25 కిమీ చొప్పున సుమారు 750 కిమీ మేర పాదయాత్ర చేస్తారు. మొత్తం 55 రోజులపాటు సాగే ఈ పాదయాత్ర అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో బహిరంగ సభతో ముగుస్తుంది. హుజూరాబాద్ ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఆ నియోజకవర్గంలో అన్ని మండలాలలో పాదయాత్ర చేస్తారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో చిక్కుకుపోయింది. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న సిఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే క్విట్ ఇండియా ఉద్యమస్పూర్తితో ఈ పాదయాత్ర చేపడుతున్నాను. ఈ యాత్రలో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తాను. రాష్ట్రంలో గడీల పాలన అంతమొందించి గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేసి రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యం నెలకొల్ప డానికి ఈ పాదయాత్ర దోహదపడుతుందని భావిస్తున్నాను,” అని అన్నారు.