
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్ళతో కొట్టి చంపాలని, తెలంగాణ సరిహద్దు వరకు తరిమి కొట్టాలంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టిఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, గండ్ర వెంకట రమణ, రోహిత్ రెడ్డి భగ్గుమన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి... నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోము. ఆయన రాళ్ళతో కొడితే మేము చెప్పులతో కొడతాము. నీవి స్వార్ధ రాజకీయాలు మావి తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న సేవా సేవలు. మేము రాజ్యాంగబద్దంగానే టిఆర్ఎస్లో విలీనం అయ్యాము తప్ప నీలాగ నీచరాజకీయాలు చేయలేదు. అయినా మానిక్కం టాగూర్కి 25 కోట్లు లంచం ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుకొన్నమాట వాస్తవం కాదా? ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగవి నువ్వు. నువ్వు నీతులు చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అంటూ సుధీర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
గండ్ర వెంకట రమణ మాట్లాడుతూ, “నీ రాజకీయ ఎదుగుదల మొదటినుంచి వివాదాస్పదంగానే ఉంది. టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరే ముందు ఆ తరువాత కానీ నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు కదా?నువ్వు ఆచరించని నీతులు ఇతరులకు బోధించడం దేనికి? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు పార్టీలు మారితే సంసారం మేము మారితే వ్యభిచారమా? ఉన్నత పదవిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి తప్ప ఈవిదంగా రాళ్ళతో కొట్టి చంపాలంటూ చిల్లర మాటలు మాట్లాడకూడదని తెలుసుకొంటే మంచిది,” అని అన్నారు.