దేశ ప్రజలకు కేంద్రం సూచన

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో చాలా రాష్ట్రాలలో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఎత్తివేశాయి. దాంతో మళ్ళీ రోడ్లపైకి భారీగా జనాలు తరలివస్తున్నారు. అందుకు ప్రజలను ఎవరూ తప్పు పట్టలేరు కానీ మాస్కులు ధరించకుండా తిరుగుతున్నవారు, అవసరం లేకపోయినా షాపింగులకు, షికార్లకు బయలుదేరుతున్నవారి వల్లనే దేశంలో మళ్ళీ కరోనా వ్యాపించే అవకాశం ఉంది. కరోనా మొదటి, రెండో దశల్లో ఇది రుజువైంది కూడా. కనుక కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయిందని ప్రజలు నిర్లక్ష్యంగా తిరగవద్దని కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత దేశంలో మళ్ళీ కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పెరిగిందని చెప్పారు. నేటికీ దేశంలో 71 జిల్లాలలో కరోనా తీవ్రత తగ్గలేదని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే 18 ఏళ్ళకు పైబడిన వారందరూ తప్పనిసరిగా కరోనా టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచి వాక్సినేషన్ కార్యక్రమం మొదలుపెట్టినుంచి ఇప్పటి వరకు మొత్తం 34.41 కోట్ల మందికి పైగా టీకాలు వేసుకొన్నారని తెలిపారు. 

కరోనా మహమ్మారి నుంచి భారత్‌ బయటపడాలంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తే సరిపోదు దేశ ప్రజలందరూ కూడా క్రమశిక్షణతో మెలుగుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించినప్పుడే సాధ్యమవుతుంది. లేకుంటే కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు కొత్తరూపాలు ధరిస్తూ భారత్‌లో శాస్వితంగా ఉండిపోతుంది. అదే కనుక జరిగితే ఇంకా కోట్లాదిమంది ప్రజలు మహమ్మారినబడి ప్రాణాలు కోల్పోవచ్చు లేదా చికిత్స కోసం అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడవచ్చు. ఇక లాక్‌డౌన్‌ కష్టాలు ఏవిదంగా ఉంటాయో అందరికీ తెలుసు. మనకీ ఈ కష్టాలు, కన్నీళ్ళు వద్దనుకొంటేదేశ ప్రజలందరూ కూడా క్రమశిక్షణతో మెలుగుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం చాలా అవసరం.