
టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్లిపోవాలనుకొంటున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. వాటిపై ఆయన స్పందిస్తూ, “నేను పార్టీ మారుతానన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్నవి పుకార్లు మాత్రమే. వాటిని నేను ఖండిస్తున్నాను. సిఎం కేసీఆర్ను నేను ఎన్నడూ మంత్రి పదవి అడగలేదు. కానీ అడిగానంటూ కొందరు పనికట్టుకొని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.నేను కేవలం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలనే టిఆర్ఎస్ పార్టీలో చేరాను తప్ప పదవులు, అధికారం ఆశించి కాదు. కనుక నేను ఎప్పటికీ టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. సిఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను. నా ఇంట్లోకి కేవలం గులాబీ కండువా కప్పుకొన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండగా నాకు చాలా అవమానాలు జరిగాయి. కనుకనే ఆ పార్టీని వీడి నాకు గౌరవం కల్పిస్తున్నా టిఆర్ఎస్లో చేరాను. ఇటువంటి పుకార్లు, దుష్ప్రచారంతో టిఆర్ఎస్లో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నవారి ఆటలు సాగవు. డబ్బులిచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుకొన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ ఏవిదంగా పనిచేస్తుందో ఊహించవచ్చు,” అని అన్నారు.