సిరిసిల్లాలో పర్యటించనున్న సిఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సిఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారు రూ 70 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత కలెక్టరేట్ భవనం, నర్సింగ్ కళాశాల, రెండు పడక గదుల ఇళ్ళు నిర్మించారు. వాటికి ప్రారంభోత్సవం చేసి ఇళ్ళను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అలాగే ఎల్‌వి ప్రసాద్ కంటి దవాఖానను సిఎం కేసీఆర్‌  ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది పట్టణాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రారంభోత్సవాల అనంతరం సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఆవిర్భవించినప్పటి నుండి నేటి వరకు సాధించిన ‘ప్రగతి నివేదిక’ను వారు సీఎంకు అందజేస్తారు.