తెలంగాణ ప్రజలకు నేటికీ స్వేచ్చ లేదు: రేవంత్‌

మొదటి నుంచి చాలా దూకుడుగానే వ్యవహరిస్తున్న ఎంపీ రేవంత్‌ రెడ్డి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఓ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఆనాడు నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్చ కోసం పోరాడుతూనే ఉన్నారు. నేటికీ పోరాడుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజలకు స్వేచ్చ లభించలేదు. సిఎం కేసీఆర్‌ కుటుంబం చేతిలో నిర్బందంలో నలిగిపోతున్న తెలంగాణ సమాజం స్వేచ్ఛ కోరుకొంటోంది. కేసీఆర్‌కు తెలంగాణ అనే బంగారు బాతును ఇస్తే దానిని ఆయన కుటుంబం కోసుకుతింటోంది. తెలంగాణ సమాజం వారి కుటుంబానికి ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చింది. సిఎం కేసీఆర్‌ కుటుంబానికి పదవులు, అధికారం, డబ్బు, విలాసవంతమైన జీవితాలు లభించాయి కానీ తెలంగాణ కోసం పోరాడి చితికి పోయినవారికి ఏమి లభించాయి?సిఎం కేసీఆర్‌ కనీసం అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోలేదు. అందుకే ఇకపై కేసీఆర్‌ కుటుంబానికి ఇచ్చినవ్వన్నీ గుంజుకొంటాము. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ను గద్దె దించుతాము. అప్పుడే తెలంగాణ సమాజానికి నిజమైన విముక్తి, స్వేచ్ఛ లభిస్తాయి,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.