ప్రతీ జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో వ్యవసాయం పెరిగింది దాంతో వ్యవసాయోత్పత్తులు కూడా భారీగా పెరిగాయి. అయితే వాటిని యధాతధంగా అమ్ముకోవడం కంటే ప్రజలు వినియోగించేవిదంగా ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే వాటి విలువ చాలా పెరుగుతుంది...దాంతో రైతులు లాభపడతారని సిఎం కేసీఆర్‌ ముందే చెప్పారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చాలా కాలం క్రితమే చెప్పారు. ఆ ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. 

రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ బుదవారం హైదరాబాద్‌లోని టీఎస్‌ఐఐపీసీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు, విధివిధానాల గురించి చర్చించారు. కనీసం 225 ఎకరాలు అంతకుమించి భూములను ఒక జోన్‌గా ఏర్పాటు చేసి వాటిలో పండే పంటలను బట్టి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం తెలంగాణ ఫుడ్ మ్యాప్ కూడా రూపొందించుకొని తదనుగుణంగా పూర్తి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో పండే వరి, పసుపు, చిరుధాన్యాలు, మిరప, వంటనూనెలు, పండ్లు, కూరగాయలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, వాటిలో తయారైన వాటిని నిలువ, రవాణా, మార్కెటింగ్‌ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు గురించి కూడా చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన భూసేకరణ చేసి, వాటికి విద్యుత్, రోడ్లు, నీళ్ళు వంటి మౌలికవసతులు కల్పించాలని, ఆ యూనిట్ల ద్వారా వచ్చే వ్యర్ధాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 350 దరఖాస్తులు వచ్చినప్పటికీ వీటిలో మరింతమందిని భాగస్వాములుగా చేయడానికి దరఖాస్తుల గడువు పొడిగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటైతే రైతులు లబ్ది పొందడమే కాకుండా స్థానిక యువతకు ఉద్యోగాలు కూడా లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.