
నాగార్జునసాగర్ జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో మళ్ళీ రెండు ప్రభుత్వాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించింది. ఊహించినట్లే గురువారం ఉదయం ఏపీ అధికారులు ప్రాజెక్టు వద్ద తెలంగాణ జెన్‌కో అధికారులను కలిసి ఓ మెమోరండం ఇచ్చేందుకు వచ్చారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొన్నారు. జెన్‌కో అధికారులు దానిని తీసుకొనేందుకు నిరాకరించారు. ఆ లేఖను ఫ్యాక్స్ ద్వారా తమ ప్రభుత్వానికి పంపించాలని కోరడంతో ఇక చేసేదేమీలేక ఏపీ అధికారులు వెనుతిరిగారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముడిపడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్ళ వాడకం, విద్యుత్ ఉత్పత్తి విషయాలలో గతంలో కూడా ఇటువంటి సమస్యలు ఎదురయ్యాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య సఖ్యత ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు తల్లెత్తేవి కావు. వారి మద్య దూరం పెరిగినప్పుడు ఇటువంటి అవాంఛనీయ పరిణామాలు జరుగుతుంటాయి. ఎన్నికలప్పుడు కూడా ప్రజలలో సెంటిమెంట్ రగిలించేందుకు ఇటువంటివి ఉపయోగపడుతుంటాయని అందరికీ తెలుసు. కనుక ఈ సమస్యలో నిజానిజాలు ఏమిటో టిఆర్ఎస్, వైసీపీలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఆదర్శంగా నిలువవలసిన పాలకులు ఇటువంటి సమస్యలను విజ్ఞతతో సామరస్యంగా పరిష్కరించుకొనేబదులు, ఘర్షణ పడటం ఎవరికీ మంచిది కాదు. ఎవరూ హర్షించరు.