నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు షురూ

నేటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యాయి. పది రోజులపాటు ఏకధాటిగా సాగే ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్లు, మేయర్లు, కమీషనర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలు, పల్లెలలో నెలకొనిఉన్న సమస్యలను పరిష్కరించుకొంటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కోట్లాది మొక్కలు నాటుతారు. 

ముందుగా ఈరోజు వార్డు సమావేశాలు, గ్రామాలలో గ్రామసభలను నిర్వహించి సమస్యలను గుర్తించి అజెండా తయారుచేసుకొంటారు. రేపటి నుంచి వరుసగా ప్రజల భాగస్వామ్యంతో ఆ సమస్యలను పరిష్కారం కోసం పనులు మొదలుపెడతారు. వాటిలో కాలువల పూడికతీత, పల్లెలోని రోడ్ల పక్కన, ప్రకృతివనాలలో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలలో కలుపుమొక్కలను, వ్యర్ధాలను తొలగించడం, తరువాత వరుసగా గుర్తించిన చోట మొక్కలు నాటడం, వాటికి ట్రీ గార్డులను ఏర్పాటుచేయడం వంటి పనులను చేపట్టి పూర్తి చేస్తారు. ఈ పదిరోజులలోనే ఒక రోజు పూర్తిగా విద్యుత్ సంబంధిత సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారు. అలాగే ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, మంచినీటి సరఫరా ట్యాంకులు వగైరాలకు సంబందించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకొంటారు.   

పల్లె/పట్టణ ప్రగతి ముగింపు రోజున అంటే పదోరోజున ఈ పదిరోజులలో చేసిన పనుల గురించి చర్చించి నివేదిక తయారుచేసి పై అధికారులకు అందజేస్తారు. వాటి ఆధారంగా జిల్లా కలెక్టర్లు సమగ్ర నివేదికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ నివేదికల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తుంటుంది. ఈ ఏడాది పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 కోట్లు విడుదల చేసింది. 

పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో ఆయా ప్రాంతాలలో మంచిమార్పు కనిపిస్తుండటంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకువచ్చి వీటిలో పాల్గొంటున్నారు. ఈ ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుకొసం ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలలో మొత్తం 8,20,727 మంది వారిలో 4,03,758 మంది మహిళలు సభ్యులుగా ఉండటమే ఇందుకు చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.