
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుదవారం వరంగల్ కార్పొరేషన్, అర్బన్ కలెక్టరేట్ కార్యాలయాలలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వరంగల్, హన్మకొండ ఎంతో గొప్ప చరిత్ర కలిగినవి. కనుక వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చాలని నిర్ణయించాము. జిల్లాలతో బాటు కొన్ని మండలాలను కూడా మార్చబోతున్నాం. రెండు జిల్లాల పేర్లను వారం రోజుల్లోపు మార్చుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. ఏడాదిలోగా వరంగల్ (రూరల్) సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం పూర్తి చేస్తాం. కలెక్టరేట్ కార్యాలయాన్ని అజాంజాహీ మిల్స్ ఉన్న ప్రాంతంలో లేదా ఆటోనగర్‌లో ఎక్కడ నిర్మిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అధ్యయనం చేస్తున్నాం. దీనికి సంబందించి అన్ని పనులను ప్రభుత్వ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చూస్తారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపూనేని నరేందర్ ఈ పనులకు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు,” అని చెప్పారు.