కేంద్ర క్యాబినెట్‌ విస్తరణలో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత?

నరేంద్రమోడీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రెండేళ్ళ తరువాత మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఉత్తరాదిన వివిద రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున ఈసారి విస్తరణలో అన్ని పదవులు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల వారికే దక్కబోతున్నట్లు తాజా సమాచారం. ఢిల్లీ, యూపీ, ఎంపీ, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, అస్సాం, లద్దాక్‌కు చెందిన వివిద పార్టీల ఎంపీలకు ఈసారి కేంద్రమంత్రి పదవులు లభించబోతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినప్పటికీ 70కి పైగా స్థానాలు సాధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి సవాలు ఇవ్వగల స్థాయికి ఎదిగినందున, ఆ రాష్ట్రంలో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు లభించనున్నాయని తాజా సమాచారం. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ యూపీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీ తిరిగి రాగానే జూలై మొదటివారంలో కేంద్రమంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని తెలుస్తోంది.