
ఇటీవల సిఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతలతో ప్రగతి భవన్లో దళిత సాధికార సమావేశం నిర్వహించి, దళితులకు వరాలు ప్రకటించడంపై బిజెపి నేత ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు ఈ ఏడేళ్ళుగా దళితులు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు హటాత్తుగా దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతుండటం వారిని మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలే. దళితుల సాయంతో అధికారం దక్కించుకొని మళ్ళీ వారినే మభ్య పెట్టాలనుకోవడం చాలా దారుణం. ఎన్నికలకు ముందు ఈవిదంగా మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి గెలవడం సిఎం కేసీఆర్‌కు పరిపాటిగా మారిపోయింది.
సిఎం కేసీఆర్‌కు నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ది ఉండి ఉంటే ఈ ఏడేళ్ళలోనే చాలానే చేయగలిగేవారు. ఏడాదికి కనీసం ఓ వెయ్యి కోట్లు ఖర్చు చేసినా దళితులకు ఎంతో మేలు జరిగి ఉండేది. కానీ దళితులకు కేటాయించిన నిధులను వేరే పధకాలకు మళ్లించడమో లేదా ఖర్చు చేయకపోవడంతో వెనక్కు తిరిగి వెళ్ళిపోతుండటమో జరుగుతోంది. దళితుల సంక్షేమం పట్టించుకోకుండా పెద్ద విగ్రహాలు, పెద్ద భవనాలు కట్టించడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న రెవెన్యూ సంస్కరణల వలన దళితులకు ఒరిగేందేమీ లేదు. వారు తెల్లకాగితాలపై వ్రాసుకొని కొనుగోలు చేసిన భూములు మళ్ళీ దొరల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కనీసం దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళయినా కట్టించి ఇవ్వలేదు. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కనబడుతున్నాయి. ప్రాజెక్టులలో లబ్ధిపొందిన కొందరు కాంట్రాక్టర్లు వాటిని కట్టిస్తున్నారు. హుజూరాబాద్‌లో ఇళ్ళు ఎందుకు నిర్మించలేదు?టిఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎవరికీ సిఎం కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం లేదు. అందరూ బానిసల్లా బతుకుతున్నారు,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేశారు.