
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మంగళవారం ఉదయం ములుగు జిల్లా నుంచి భారీ కార్ ర్యాలీతో జూబ్లీ హిల్స్‌లోని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీ అందరి అభిమానం, భగవంతుడి ఆశీసులతో రేవంత్ అన్నకు పిసిసి అధ్యక్ష పదవి లభించింది. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడి రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది,’ అని అన్నారు.
తరువాత రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజల కష్టాలను చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అది కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడింది. రాష్ట్రం కల్వకుంట్ల చేతిలో బందీ అయిపోయింది. కనుక వారి చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని మళ్ళీ విడిపించేందుకే సోనియా గాంధీ నాకు ఈ పదవి ఇచ్చారు. నాకు పిసిసి ఇస్తున్నారని ఇంటలిజన్స్ వర్గాలు సిఎం కేసీఆర్‌కు తెలియజేయడంతో అప్పటి నుంచే ప్రగతి భవన్ తలుపులు అందరి కోసం తెరుచుకొంటున్నాయి. అయితే రాష్ట్రప్రజలు అనుభవిస్తున్న ఈ కష్టాలు తీరాలంటే సిఎం కేసీఆర్‌ను గద్దె దించకతప్పదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కేసీఆర్‌ను గద్దె దించుతాము. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఈ అరాచక పాలనకు స్వస్తి పలుకుతాము,” అని అన్నారు.