
పిసిసి అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి అది దక్కకపోవడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. దశాబ్ధాలుగా పార్టీకి సేవ చేస్తున్నా తనను కాదని టిడిపి నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మళ్ళీ గాంధీభవన్‌లో అడుగుపెట్టబోనని’ ఆయన శపధం చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగిరాగానే పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇప్పుడు ‘తనను రాజకీయాలలోకి లాగొద్దని, రాజకీయాల గురించి ఇక మాట్లాడబోనని చెప్పడం విశేషం. ఇక నుంచి తన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో పర్యటిస్తానని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయిస్తానని తెలియజేస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
అంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి... వ్యవహారాలకు దూరంగా ఉండాలనుకొంటున్నట్లు అర్ధమవుతోంది. కానీ రాజకీయనాయకుడిగా ఉంటూ రాజకీయాలలోకి తనను లాగొద్దన్ని రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః శ్మశాన వైరాగ్యం... ప్రసూతీ వైరాగ్యంలాగే ఈ రాజకీయ వైరాగ్యం కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఆ తరువాత కాంగ్రెస్‌లోనే ఉంటూ రేవంత్ రెడ్డితో పోరాడుతారా లేదా బిజెపిలో చేరి కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకొంటారా? అనేదే చూడాలి.