హైదరాబాద్‌లో నాలుగు లింక్ రోడ్లు ప్రారంభోత్సవం

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం హైదరాబాద్‌లోని నాలుగు లింక్ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్ వరకు (1.94కిమీ), జేవీజీ హిల్స్ నుంచి మసీద్ బండ వరకు (1.01కిమీ), కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం నుంచి నోవాటేల్ గేట్ వరకు (0.6కిమీ), వసంతనగర్ సిటీ నుంచి ఎన్‌ఏసీ వరకు (0.75కిమీ) లింక్ రోడ్లకు మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభోత్సవం చేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ సీఆర్‌ఎంపీ కింద మొత్తం రూ.1800 కోట్లు వ్యయంతో నగరంలో ఈ లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాము. ఇప్పటి వరకు మొదటి దశలో రూ. 313.65 కోట్లతో నగరంలో 16 లింక్ రోడ్లను పూర్తిచేశాము. మిగిలిన వాటిని కూడా దశలవారీగా పూర్తి చేస్తాము. ఈ లింక్ రోడ్లతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ఇవి కాక ఇంకా ఎస్‌ఆర్డీపీ కింద నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాసులు కూడా నిర్మిస్తున్నాము. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని అవసరమైన జంక్షన్లలో లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌ పాసులు కూడా నిర్మిస్తున్నాము,” అని చెప్పారు.