
వచ్చే ఏడాది జరుగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ 100 సీట్లకు పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్‌లో ప్రకటించారు. దీని కోసం అప్పుడే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించామని తెలియజేశారు. యూపీలోని భగీదరి సంకల్ప్ మోర్చా పేరిట ఓ కూటమిని ఏర్పాటు చేస్తున్న ఓంప్రకాష్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పీ)తో ఎన్నికల పొత్తులు పెట్టుకొని పోటీ చేయబోతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అయితే సీట్లు, పొత్తులపై ఇంకా చర్చలు ప్రారంభం కాలేదని తెలిపారు.
ఇంతకాలం పాత బస్తీకే పరిమితమయిన మజ్లీస్ పార్టీ మెల్లగా ఇతర రాష్ట్రాలలో కూడా పోటీ చేస్తూ కొన్ని విజయాలను, కొన్ని అపజయాలను పొందింది. ముందుగా మహారాష్ట్రలో పోటీ చేసి 2 స్థానాలలో గెలిచింది. గత ఏడాది బిహార్ శాసనసభ ఎన్నికలలో 20 స్థానాలకు పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకొని ఆ రాష్ట్రంలో అడుగుపెట్టింది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కూడా మజ్లీస్ పార్టీ పోటీ చేసింది కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. వివిద రాష్ట్రాలలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పోటీ చేస్తుండటం ద్వారా మజ్లీస్ పార్టీని ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేయాలని అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా కృషి చేస్తున్నారు.
అయితే బిజెపి, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్న యూపీలో మజ్లీస్ పార్టీ ఈసారి ఏకంగా 100 సీట్లకు పోటీ చేయాలనుకోవడం చాలా సాహసమే. కానీ 25-35 సీట్లు గెలుచుకొన్నా మజ్లీస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుంది. దాంతో ఆ స్థాయిలో ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది కూడా.