
తెలంగాణలోని దళిత కుటుంబాలకు గొప్ప శుభవార్త! రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,900 దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికసాయం అందజేనుంది. ముఖ్యమంత్రి దళితసాధికారత పధకంలో భాగంగా ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమా చేస్తుంది. దానిని ఏవిదంగా వినియోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఎటువంటి షరతులు విధించకుండా పూర్తి స్వేచ్చనిస్తుంది. దాంతో వారు తమకు నచ్చిన వ్యాపారం, వృత్తి ఏదైనా చేసుకోవచ్చు.
రాబోయే నాలుగేళ్ళలో ఈ పధకం కింద మొత్తం రూ.40,000 కోట్లు ఖర్చు చేయబోతునట్లు సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్లో జరిగిన ముఖ్యమంత్రి దళిత సాధికారత సమావేశంలో ప్రకటించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా రూ.1,200 కోట్లు బడ్జెట్లో కేటాయించిందని అవసరమైతే మరో రూ.300 కోట్లు కేటాయిస్తామని సిఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దళిత కుటుంబాలకు ఆర్ధిక స్వావలంభన, ఆర్ధిక సాధికారత కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపేందుకే ఈ పధకాన్ని అమలుచేయబోతున్నట్లు తెలిపారు.
ఈ పధకాన్ని పూర్తి పారదర్శకంగా, సమర్ధంగా నిర్వహించేందుకు సీఎంఓలో ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తామని తెలిపారు. రెండు వారాలలోగా రాష్ట్రంలో దళితుల వ్యవసాయ భూములపై నివేదిక ఇవ్వాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితులకు మరికొన్ని వరాలు ప్రకటించారు.
దళిత విద్యార్దులకు విదేశాలలో విద్యనభ్యసించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయం సీలింగ్‌ను సడలిస్తాం.
ఇకపై దళితులపై దాడి చేస్తే పోలీసులను ఉద్యోగాలలో నుంచి తొలగిస్తాం.
దళిత ఉద్యోగులకు రెండు వారాలలోగా పదోన్నతులు.
లైసెన్సులు, పెట్టుబడులలోనూ దళితులకు రిజర్వేషన్లు.
దళిత పారిశుద్య కార్మికులకు పీఆర్సీ తరహాలో ప్రయోజనాలు కల్పిస్తాం.
భూమి లేని దళితులకు భీమా సౌకర్యం.