నేడు ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం!

ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ పేరిట అఖిలపక్ష సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో దళితుల సమస్యలపై చర్చించి వారి సంక్షేమం కోసం తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశానికి టిఆర్ఎస్‌తో సహా వివిద పార్టీలలోని ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, శాసనసభా పక్ష నేతలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. కడియం శ్రీహరి, చాడా వెంకటరెడ్డి, బాలనర్సింహా, తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, మందా జగన్నాధం, మోత్కుపల్లి నర్సింహులు, ఆరేపల్లి మోహన్, జి.ప్రసాద్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

గత ఏడేళ్లుగా రాష్ట్రంలో దళితులను భూటకపు హామీలతో మోసగిస్తూ, వారిపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు దీంతో మరో కొత్త డ్రామా మొదలుపెడుతోందని, కనుక ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం అందినప్పటికీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేవంత్‌ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడటంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆ హడావుడిలో ఉన్నారు. కనుక వారు కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చు. ఒకవేళ హాజరుకాదలచుకోకపోతే వారు కూడా బిజెపి చేసిన ఆరోపణలనే చేయవచ్చు.