జమ్మూ విమానాశ్రయంలో ప్రేలుళ్ళు

భారత్‌ వాయుసేన ఆధీనంలో ఉన్న జమ్మూ విమానాశ్రయంలోని సాంకేతిక విభాగం పని చేసే భవనంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు రెండు గంటలకు 5 నిమిషాల వ్యవధిలో రెండు ప్రేలుళ్ళు జరిగాయి. ప్రేలుళ్ళ ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రేలుళ్ళలో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు కానీ ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. 

ఈ సమాచారం అందుకొన్న జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా దళాలు హుటాహుటిన అక్కడకు చేరుకొని విమానాశ్రయం దాని పరిసర ప్రాంతాలలో గాలిస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ కూడా అక్కడకు చేరుకొని నిందితులు, ఆధారాల కోసం గాలిస్తున్నారు. ఈరోజు ఉదయం జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) కూడా జమ్ముకు బయలుదేరిన్నట్లు సమాచారం. ఈ ప్రేలుళ్ళకు కారణం ఏమిటో ఇంతవరకు తెలియలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన విమానాశ్రయంలో ఈ ప్రేలుళ్ళు జరుగడంతో ఇది ఉగ్రవాదుల పనా లేక లోపల ఏదైనా ప్రమాదం కారణంగా జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ ద్వారా బాంబులు ప్రయోగించి ఈ ప్రేలుళ్ళకు పాల్పడి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ప్రేలుళ్ళకు కారణం ఇంకా తెలియవలసి ఉంది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన జమ్ముకశ్మీర్‌లో మళ్ళీ శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందనే ఉద్దేశ్యంతో మళ్ళీ రాష్ట్రంగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో ఈ ప్రేలుడు జరగడం విశేషం.