
దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. హైదరాబాద్లో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి నగరంలో స్థిరపడుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో జనాభా, వాహనాలు, ట్రాఫిక్ కూడా పెరిగిపోతోంది. కనుక తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నగరంలో రద్దీ ఎక్కువగా ఉన్న చౌరస్తాలను గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తూనే ఉంది. వాటిలో ఒకటి బాలానగర్ ఫ్లై ఓవర్. రూ.387 కోట్లు ఖర్చుతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ జూలై మొదటివారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
దీనికి 2017లో మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేయగా అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మూడున్నరేళ్ళలోనే నిర్మాణపనులు పూర్తి చేశారు. ఇక్కడ రద్దీని దృష్టిలో పెట్టుకొని దీనిని ఆరు లేన్లతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ పొడవు 1.13 కిమీ పొడవు.
ఇదివరకు బోయినపల్లి నుంచి కూకట్పల్లి వైపు వెళ్ళాలంటే ట్రాఫిక్ కారణంగా కనీసం ముప్పావుగంట పట్టేది కానీ ఇప్పుడు ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కేవలం 15-20 నిమిషాలలో చేరుకోగలరు. ఈ ఫ్లై ఓవర్ వినియోగంలోకి వస్తే చాలావరకు వాహనాలు దానిపై నుంచి వెళ్లిపోతాయి కనుక సనత్ నగర్, ఫతే నగర్-జీడిమెట్ల మద్య రాకపోకలు సాగించేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి.