
తెలంగాణ రాష్ట్రంలో ఉప్పూనిప్పూలా ఉండే పార్టీలు అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంత దయనీయస్థితికి చేరుకోవడానికి కారణం టిఆర్ఎస్ పార్టీయే అని అందరికీ తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీని బలహీనపరిస్తే ఇక రాష్ట్రంలో టిఆర్ఎస్కు ఎదురే ఉండదని సిఎం కేసీఆర్ భావిస్తే, దాని స్థానంలోకి అంతకంటే బలమైన బిజెపి ప్రవేశించి టిఆర్ఎస్కు సవాళ్ళు విసురుతుండటంతో మళ్ళీ పునరాలోచన మొదలైనట్లు కనిపిస్తోంది.
బిజెపిని భరించడం కంటే కేంద్రంలోను, రాష్ట్రంలోనూ బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని భరించడమే సులువని సిఎం కేసీఆర్ గ్రహించారేమో తెలీదు కానీ నిన్న కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చి ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. వారు మరియమ్మ కేసు వ్యవహారం గురించి మాట్లాడుకొన్న మాట వాస్తవం అయితే అది వారి భేటీకి ఒక కారణం మాత్రమే అయ్యుండవచ్చు. త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలకూ దీనికీ ఏమైనా సంబందం ఉండవచ్చు.
ఏవిదంగా అంటే బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తారని భావిస్తున్న ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు సిఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారేమో? ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు చాలా బలముంది. మంచి ప్రజాధారణ, మంత్రి వర్గం నుంచి అవమానకరంగా తొలగించారనే ప్రజలలో సానుభూతి కూడా ఉంది. పైగా హుజూరాబాద్‌లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలా?అని టిఆర్ఎస్ ఇంకా వెతుకుతూనే ఉంది.
ఈటల రాజేందర్ చేతిలో టిఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోవడం అంటే సిఎం కేసీఆర్ ఓడినట్లే అవుతుంది కనుక అంత రిస్క్ తీసుకొనే బదులు అక్కడ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించి ఈటల రాజేందర్‌ను ఓడగొడితే అది తన విజయమే అవుతుందని సిఎం కేసీఆర్ భావిస్తున్నారేమో? ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీలో వ్యక్తిని అభ్యర్ధిగా నిలబెట్టకుండా హటాత్తుగా సురభి వాణీదేవిని పార్టీలోకి ఆహ్వానించి అభ్యర్ధిగా ప్రకటించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నికలలో కూడా ఇదేవిదంగా కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇచ్చి ఈ సమస్య నుంచి బయటపడాలని సిఎం కేసీఆర్ చూస్తున్నారేమో? ఏది ఏమినప్పటికీ కాంగ్రెస్ నేతలతో సిఎం కేసీఆర్ భేటీ అవడం కేవలం మరియమ్మ కేసు గురించి మాట్లాడటానికి మాత్రమే అనుకోలేము. వారు ఎందుకు భేటీ అయ్యారో ఎన్నికల గంట మ్రోగితే గానీ తెలీదు.