హైదరాబాద్‌లో 330 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు ప్రారంభోత్సవం

హైదరాబాద్‌ నగరంలో ఓ ఫ్లాట్ కావాలన్నా కనీసం రూ.70 లక్షల నుంచి కోటి రూపాయలు చేతిలో పట్టుకోవాల్సిందే. అటువంటిది 330 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ(ఫ్లాట్స్)ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి పేదలకు ఉచితంగా అందజేసింది. నగరంలోని అంబేడ్కర్ నగర్‌లో కొత్తగా నిర్మించిన 330 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ ఈరోజు ప్రారంభోత్సవం చేసి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, డెప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం రూ.9,000 కోట్లు ఖర్చు చేసి      ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మించింది. పేదప్రజలు కూడా ఆత్మగౌరవంతో సంతోషంగా జీవించాలనే సిఎం కేసీఆర్‌ ఆశయం మేరకు ఈ కార్యక్రమం చేపట్టాము. సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను కట్టించి పేదలకు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఈ ఇళ్ళ పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. అవసరమైతే మరిన్ని ఇళ్ళు నిర్మించి ఇస్తాం. ఇది నిరంతరం సాగే కార్యక్రమం కనుక ఇళ్ళు లభించనివారు ఆందోళన చెందనవసరం లేదు.

త్వరలోనే ఇక్కడ ఓ ఫంక్షన్ హాల్, బస్తీ దవాఖానా కూడా నిర్మిస్తాము. హైదరాబాద్‌ నగరంలో కోటి రూపాయలు విలువచేసే ఇళ్ళను ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చిందని లబ్దిదారులు సంతోషంగా చెపుతుంటే నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోతోంది. మీ కోసం సిఎం కేసీఆర్‌ ఇళ్ళు కట్టించి ఇచ్చారు కనుక మీరు కూడా ఆయన కోరిక ప్రకారం ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొంటూ, చెట్లు నాటి పచ్చదనం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బాధ్యతను ఇక్కడి మహిళలే తీసుకోవాలి. హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళనం చేసి అందంగా తీర్చిదిద్దాడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. కనుక దానిలో చెత్తాచెదారం పోయకుండా కాపాడుకోవాలి,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.