యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మరియమ్మ అనే దళితమహిళ మృతి చెందడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిన్న సిఎం కేసీఆర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందిస్తూ ఆమె మృతికి కారకులైన పోలీసులను తక్షణమే విధులలో నుంచి తొలగించి విచారణ జరిపించాలని డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ వారు ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలితే వారిని తక్షణం ఉద్యోగాలలో నుంచి తొలగించాలని ఆదేశించారు. డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా చింతకాని గ్రామానికి వెళ్ళి బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి రావాలని ఆదేశించారు. సోమవారం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి రావాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.
దళితులు, బడుగు బలహీనవర్గాలు, నిరుపేద ప్రజల పట్ల సమాజం ముఖ్యంగా పోలీసుల దృక్పదంలో మార్పు రావలసిన అవసరం ఉందని సిఎం కేసీఆర్ అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి.. తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను ఉపేక్షించరాదని సిఎం కేసీఆర్ అన్నారు.