కాంగ్రెస్‌ నేతలతో సిఎం కేసీఆర్‌ భేటీ!!!

తెలంగాణ రాజకీయాలలో ఈరోజు ఓ అరుదైన ఘటన జరిగింది. ఏనాడూ ప్రతిపక్ష నేతలతో భేటీ అవ్వన్ని సిఎం కేసీఆర్‌ తొలిసారిగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి వారితో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ అనే మహిళ చనిపోవడంపై పిర్యాదు చేసి ఈ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “దళిత మహిళ మరియమ్మ మృతికి కారకులైనవారిపై  చర్యలు తీసుకొని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరాము. అందుకు సిఎం కేసీఆర్‌ అంగీకరించారు. మరియమ్మ కుటుంబానికి ఓ ఇల్లు, ఆమె బిడ్డలకు రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌కు కూడా రూ.15 లక్షలు ఆర్ధికసాయం చేసి, ప్రభుత్వోద్యోగం కూడా ఇవ్వాలని కోరాము. దానికి కూడా సిఎం కేసీఆర్‌ అంగీకరించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. మళ్ళీ ఇటువంటి ఘనటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం కేసీఆర్‌ కోరగా తప్పకుండా తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు,” అని చెప్పారు.